కొత్తగూడెం బ్యూరో ఆగస్టు 21(SBNEWS)
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 14 వ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతంలోని గోధుమ వాగు బ్రిడ్జిపై ఏర్పడిన భారీ గుంతకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
గురువారం ఉదయం నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలు చోటుచేసుకోకుండా వెంటనే రాకపోకలను నిలిపివేసి వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.
*నూతన బ్రిడ్జిపైనే లోపం*
ఇటీవలే నిర్మించిన బ్రిడ్జిపై కొద్ది కాలంలోనే భారీ గుంత ఏర్పడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో కాంక్రీట్ మిశ్రమాన్ని సరైన నిష్పత్తిలో కలపకపోవడం, అనంతరం భారీ వాహనాల రాకపోకల కారణంగా కాంక్రీట్‌లో లోపం ఏర్పడి రంధ్రం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే గుంత ఏర్పడటానికి అసలు కారణం ఏమిటన్నది సంబంధిత అధికారులు సాంకేతికంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
*నాణ్యతపై సమగ్ర పరిశీలన చేయాలి*
మరమ్మతు పనులను కేవలం తాత్కాలికంగా చేపట్టకుండా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. మరమ్మతుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్‌లో ఇదే సమస్య పునరావృతం కాకుండా బ్రిడ్జి నిర్మాణ నాణ్యతపై సమగ్ర సాంకేతిక పరిశీలన నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై ఇలాంటి లోపం ఎందుకు తలెత్తిందనే విషయాన్ని అధికారులు వెల్లడించి, బాధ్యత వహించాల్సిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
