నేడు పినపాకలో ఏం జరిగింది..? వైరల్ అవుతున్న ముఖ్య వార్తలివే..!

SB NEWS
By -
0


1. ఆదివాసీ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: బండారి రవికుమార్

-ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఘనంగా వేడుకలు
-ఉప్పాక బ్రిడ్జి నుంచి ఇబయ్యారం క్రాస్‌ వరకు భారీ ర్యాలీ.
-కొమ్ము వాయిద్యాలతో అలరించిన ఆదివాసీలు
-కొమురం భీమ్ విగ్రహానికి ఘన నివాళులు


 ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం, జల్‌–జంగల్‌–జమీన్‌ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను సాధించేందుకు ఆదివాసీ సంఘాలు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పినపాక మండలంలోని ఇబయ్యారం క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.మండల అధ్యక్షులు దుబ్బ గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాక బ్రిడ్జి నుంచి ఇబయ్యారం క్రాస్‌ వరకు ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. సంప్రదాయ కొమ్ము వాయిద్యాలను వాయిస్తూ, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ర్యాలీ కొనసాగింది. ర్యాలీ మార్గమంతా ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని నినాదాలు చేశారు.అనంతరం ఇబయ్యారం క్రాస్‌రోడ్‌లోని కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. కొమురం భీమ్‌తో పాటు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా బండారి రవికుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కేవలం ఒకరోజు వేడుకగా నిర్వహించి ముగించకూడదని అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. వారి ఆశయాలను సాధించేందుకు ఆదివాసీ సంఘాలు, నాయకులు, యువత నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆదివాసీలకు భూమి, అడవి, సహజ వనరులతో ఉన్న అనుబంధం ఎంతో పురాతనమైనదన్నారు . జల్‌, జంగల్‌, జమీన్‌పై ఆదివాసీలకు ఉన్న హక్కుల పరిరక్షణ కోసం అనేక మంది మహనీయులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల ఫలితంగా ఆదివాసీ సమాజానికి హక్కులపై అవగాహన పెరిగిందన్నారు. అయితే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భూమి హక్కులు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ఆదివాసీ సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ యువత విద్యతో పాటు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రాముఖ్యతను కూడా రవికుమార్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ ప్రజల హక్కులు, వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే రోజుగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివాసీల ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ప్రస్తుత తరానికి ఆదివాసీ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొమురం భీమ్ వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేవలం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా, వారు కలలు కన్న సమాజ నిర్మాణం కోసం కృషి చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.అమరులైన మహనీయులకు దండలు వేసి, వారి జ్ఞాపకాలను ఒక్కరోజు మాత్రమే స్మరించుకోవడం కాకుండా.. వారి ఆశయ సాధన కోసం ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని రవికుమార్ సూచించారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఆదివాసీ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సంప్రదాయ కొమ్ము వాయిద్యాలతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శనతో ఇబయ్యారం క్రాస్‌రోడ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణ, అమరవీరుల ఆశయాల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాలనే సందేశాన్ని నాయకులు ఇచ్చారు. ఆదివాసీ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుబ్బ గోవర్ధన్‌, జిల్లా నాయకులు మడివి రమేష్, కంతారావు, సర్పంచ్ బాపనమ్మ తో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

2. పినపాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి జాతీయ స్థాయి క్రికెట్ ఉపకార వేతనం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కె. ప్రతీక చౌదరి అరుదైన ఘనత సాధించింది. హిమాలయ వెల్‌నెస్ సంస్థ నిర్వహించిన “వన్‌డర్ ఉమెన్ ఉపకార వేతనం – 2026” కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన 100 మంది విజేతల్లో ప్రతీక చౌదరి చోటు దక్కించుకుంది. క్రికెట్‌లో ప్రతిభ కనబరుస్తున్న బాలికలను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ శిక్షణ, కోచింగ్ తదితర అవసరాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రతీక చౌదరికి రూ.38 వేల ఉపకార వేతనం లభించడం పట్ల పాఠశాల హెడ్మాస్టర్ రామిరెడ్డి, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

3.దాట్ల లక్ష్మిని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

మల్లారం గ్రామపంచాయతీకి చెందిన దాట్ల లక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పినపాక మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, మల్లారం సర్పంచ్ ఇర్ఫ సాంబశివరావు ఆమెను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తగు జాగ్రత్తలు సూచించి, కొంత ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాట్ల మోహన్‌రావుతో పాటు పోలేబోయిన సురేందర్, కోడిరెక్కల రమేష్, పోలేబోయిన రఘుపతి, మేకల సాంబయ్య, షేక్ జానీ, దాట్ల అశోక్, కొమరం జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

4.జానంపేటలో ఇసుక లారీ, బైక్ ఢీ?- ముగ్గురికి గాయాలు


పినపాక మండలం జానంపేటలో ఇసుక లారీ, బైక్ ఢీ కొన్నట్టు సమాచారం. జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఈ ప్రమాదంలో గాయపడగా, గాయపడిన వారిని 108ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు గడ్డిగూడెం గ్రామానికి చెందిన కొరస నర్సింహారావు, జానంపేట పీహెచ్‌సీలో నర్స్‌గా పనిచేస్తున్న కొరస హిమవతి, గడ్డిగూడెం గ్రామానికి చెందిన మద్దెల రాణి గా స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులకు సహాయం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు తెలియాల్సి ఉంది.

5.ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ లారీ బోల్తా


పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్‌లోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ తరలిస్తున్న లారీ అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి వెళ్తున్న ఖాళీ లారీ అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాదానికి పూర్తి కారణాలు అధికారుల పరిశీలన అనంతరం వెల్లడికావాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

6.అంగన్వాడి పాఠశాలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్: సర్పంచ్ సుహాసిని


విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేలా జగ్గారం గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కనెక్షన్ అందించామని జగ్గారం గ్రామ సర్పంచ్ సుహాసిని తెలిపారు. శుక్రవారం పాఠశాలలో తాగునీటి సమస్య ఉన్నట్లు సమాచారం అందగానే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యను పరిష్కరించామన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు గ్రామపంచాయతీ నిరంతరం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default